మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. నియోజకవర్గంలోని రెండు చోట్ల ఈవీఎంలల్లో సమస్యలు తలెత్తగా.. సిబ్బంది వెంటనే సరిచేసినట్లు చెప్పారు. నాంపల్లిలో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇక్కడి 294వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం కాసేపు మొరాయించింది.
మరోవైపు నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షల నగదు పట్టుబడింది. నగదు తరలిస్తున్న కారును బీజేపీ శ్రేణులు పట్టుకున్నాయి. ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోన్న వేళ ఈ డబ్బు లభ్యం కావడం గమనార్హం. డబ్బును తరలిస్తోంది టీఆర్ఎస్ వర్గీయులేనని బీజేపీ ఆరోపించింది. చండూరులోనూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం జరిగింది. పోలీసులను చూసి ఘటనాస్థలిలోనే రూ.2 లక్షలు వదిలి కొందరు నాయకులు పరారయ్యారు. ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉపఎన్నిక పోలింగ్లో టీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తూ మర్రిగూడలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. గజ్వేల్ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేటకు చెందిన వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. పోలింగ్ నిలిపేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.