భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గురువారం రాత్రి భారీ గండి పడిన విషయం తెలిసిందే. దీంతో నీళ్లన్నీ దిగువకు వెళ్లడంతో ప్రాజెక్టు ఖాళీ అయింది. ప్రాజెక్టు కట్ట తెగి వేల ఎకరాల్లో పంట నాశనమైంది. మరోవైపు వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. పలు గ్రామాల ప్రజలు కొండలు, ఎత్తయిన భవనాల్లో రాత్రంతా తలదాచుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో సహాయక చర్యలకు వీలు లేకుండా పోయింది.
ప్రాజెక్టుకు గండి పడటంతో వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, మేడేపల్లి, వేలేరుపాడు మండలం కోయిమాదారం, గుల్లవాయికి, అల్లూరి నగర్, రెడ్డిగూడెం, గొల్లగూడెం, వసంతవాడకు వరద ప్రవాహం చేరింది. సహాయచర్యలకు వీల్లేకుండా ముంపు గ్రామాలు మూసుకుపోయాయి. మరోవైపు గోదావరి ప్రాంతంలో వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సెక్టోరియల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. గజ ఈతగాళ్లు, పడవలు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.