గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భానుడి ప్రకాశం మచ్చుకైనా కనిపించడం లేదు.నగరవాసులు వెలుగును చూడక దాదాపు పది రోజులకు పైగా అవుతుంది.ఎప్పుడు నల్లటి దుప్పటి కప్పినట్లుగా మేఘాలు దట్టంగా ఆవరించి కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ముసురు వేయడం, లేదా భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు నగరంలోని రోడ్లపై భారీగా వరద, మురుగు నీరు పేరుకుపోవడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.
అయితే, వర్షాలు కురవడం వలన నగరంలో కాలుష్యం తగ్గినట్లు తెలుస్తోంది. గతంలో కంటే కాలుష్య స్థాయి రేటు తగ్గిందని కాలుష్య నియంత్రణ మండలి బోర్డు అధికారులు వెల్లడించారు. 10 కేంద్రాల్లో వాయునాణ్యత సూచీని లెక్కించగా 53గా నమోదైందని పేర్కొన్నారు. హెచ్‌సీయూ కేంద్రం వద్ద అత్యల్పంగా 23, న్యూ మలక్ పేట వద్ద అత్యధికంగా 73గా వాలు కాలుష్య తీవ్రత నమోదు అయ్యిందన్నారు. ఇక జూపార్కు ఏరియా వద్ద 28, కొంపల్లి 55, ఈసీఐఎల్ 56, సనత్ నగర్ 59, నాచారం 62గా నమోదు అయ్యిందని తెలిపారు.