హైదరాబాద్‌లో త్వరలోనే తొలి సైక్లింగ్ పార్కు అందుబాటులోకి రానుంది. సైక్లింగ్‌తో శారీరక వ్యాయామంతో పాటు కాలుష్య నియంత్రణకు తోడ్పడవచ్చని ప్రజలకు అవగాహన కల్పిస్తున్న హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ ప్రతినిధులు ‘పాలపిట్ట సైక్లింగ్ పార్కు’ పేరుతో దీనిని రూపొందించారు. కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్‌కు ఎదురుగా అటవీశాఖకు చెందిన 47 ఎకరాల స్థలం లీజుకు తీసుకొని, అందులో మూడు కి.మీ. ట్రాక్‌ను సిద్ధం చేశారు.
ఇప్పటి వరకూ నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్కు చుట్టూ మాత్రమే సైకిల్ ట్రాక్‌లున్నాయి. ఉదయం, సాయంత్రం నడకకు వచ్చే వృద్ధులు, యువతీ, యువకులను సైకిల్ తొక్కేలా ప్రేరేపించేందుకు పచ్చదనం నడుమ ఆహ్లాదకర వాతావరణంలో సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అటవీశాఖ స్థలం అనుకూలంగా ఉందని ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో అధికారులు నిబంధనలు, షరతులు విధించి మూడేళ్ల పాటు లీజుకు కేటాయించారు.
‘ఆరోగ్యం, కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించేందుకు సైక్లింగ్ ఉద్యానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. 500 మంది ఒకేసారి తొక్కేందుకు వీలుగా సిద్ధం చేశాం. ఉదయం, సాయంత్రం వేళల్లో అందుబాటులో ఉంటుంది. ప్రవేశ రుసుంతో పాటు గంటకు రూ.50 చెల్లించాలి. నెలకు ఒకేసారి రూ.800 చెల్లించినా సరిపోతుందని’.. హైదరాబాద్ బై సైక్లింగ్ క్లబ్ అధ్యక్షుడు మనోహర్ అన్నారు.