కుక్కను చూసి భయపడి.. మూడో అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్‌

-

ఓ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఫుడ్‌ డెలివరీకి చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్‌ ప్రాణాలమీదకు వచ్చింది. ఇంట్లో ఉన్న కుక్కకు భయపడి పరుగు తీసి భవనం మీది నుంచి దూకాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది.

యూసుఫ్‌గూడలోని శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్‌ రిజ్వాన్‌(23) మూడేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 6లోని లుంబిని రాక్‌ క్యాసిల్‌ అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్థులో ఆర్డర్‌ డెలివరి ఇచ్చేందుకు వెళ్లాడు. తలుపు తట్టగానే ఇంట్లో ఉన్న జర్మన్‌ షపర్డ్‌ కుక్క మొరుగుతూ రావడంతో భయపడిన రిజ్వాన్‌ మూడో అంతస్తు నుంచి కిందకి దూకాడు.

అతడికి తీవ్ర గాయాలు కావడంతో గమనించిన యజమాని శోభన వెంటనే అంబులెన్స్‌లో నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఇంటి యజమాని నిర్లక్ష్యం వల్లే తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు మహ్మద్‌ ఖాజా గురువారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news