తెలంగాణా ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ఆమె విమర్శించారు. తాజా పరిణామాలే దీనికి నిదర్శనమని ఆమె అన్నారు. చినుకు పడితే చాలు జలమయమయ్యే హైదరాబాదును ఎలాగూ కాపాడలేకపోయారన్న విజయశాంతి… ఇప్పుడు ప్రభుత్వ చేతగానితనానికి వరంగల్ కూడా బలైందని ఆరోపణలు చేసారు.
భూకబ్జాలను ఆపలేక రెవెన్యూ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో ఈ మధ్య బట్టబయలైన కోటి రూపాయల లంచం ఘటనే చెప్తుందని ఆమె విమర్శలు చేసారు. తెలంగాణలో అత్యంత ప్రధానమైనదీ కోవిడ్ చికిత్సా కేంద్రంగానూ ఉన్న గాంధీ ఆస్పత్రి పలుమార్లు అగ్నిప్రమాదానికి గురైనా పట్టించుకోలేదని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అక్కడ ఫైర్ సేఫ్టీ వ్యవస్థ నీరుగారి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక కోవిడ్ చికిత్సా వ్యవస్థ అనేది అటు ప్రభుత్వాసుపత్రులు, ఇటు ప్రయివేట్ ఆసుపత్రుల్లోనూ కుప్పకూలిపోయిందనడానికి హైకోర్టు వేసిన మొట్టికాయల గాయాలే సాక్ష్యమని వ్యాఖ్యలు చేసారు.