కోవిడ్ మహమ్మారి వల్ల దేశంలో ఎన్నో రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. లాక్‌డౌన్‌ను ప్రకటించినప్పటి నుంచి అనేక కంపెనీలు నష్టాల బారిన పడ్డాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అనేకం మూత పడ్డాయి. కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఉపాధికి దూరం అయ్యారు. అయితే కరోనా వల్ల దేశంలో యువతే ఎక్కువగా ఉద్యోగాలను కోల్పోయారు.
కరోనా కారణంగా దేశంలో సుమారుగా 41 లక్షల మంది యువత ఉద్యోగాలను కోల్పోయారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌వో), ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)లు చేపట్టిన సంయుక్త సర్వే వివరాలను మంగళవారం విడుదల చేశారు. ముఖ్యంగా 25 సంవత్సరాల లోపు ఉన్న యువతే కరోనా వల్ల ఎక్కువగా ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారని సర్వేలో తేలింది. 41 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని వెల్లడైంది.
ఇక ఎక్కువగా నిర్మాణ రంగం, వ్యవసాయ రంగాలకు చెందిన వారే ఉపాధిని కోల్పోయారని సర్వే చెబుతోంది. 25 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు సహజంగానే ఎక్కువ అనుభవాన్ని కలిగి ఉంటారని, అందువల్ల వారిని కంపెనీలు ఉద్యోగాల నుంచి తీసేయలేదని, అంతకన్నా తక్కువ వయస్సు ఉన్నవారినే ఎక్కువగా ఉద్యోగాల నుంచి తీసేశారని తేలింది. అయితే ఉద్యోగాలను కోల్పోయిన యువత తమ నైపుణ్యాలకు మరింత పదునుపెట్టుకుంటే తిరిగి ఉద్యోగాలను సంపాదించే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు.