యువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత మూడ్రోజులుగా హైదరాబాద్ చిగురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా బుధవారం ఉదయం నుంచి నగరంలో ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి నగరంలో అసాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు కె.నాగరత్న తెలిపారు. హైదరాబాద్ నగరానికి హై అలర్ట్ ప్రకటిస్తూ.. ఇవాళ రాత్రి గంటకు 5 సెం.మీ. నుంచి 6 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మరీ మరీ చెప్పారు. ఇక బుధవారం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షంతో నగరంలోని నాలాలు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. జంట జలాశయాలకు భారీ వరద పోటెత్తుతోంది. మరోవైపు మూసీ కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రహదారులు చెరువుల్లా మారడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.