తెలంగాణలో సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. సాయంత్రం 5.30 గంటలకు కుండపోతగా కురిసింది. దాదాపు అరగంట పాటు భారీ వర్షం కురవడంతో నగర ప్రజలు వణికిపోయారు. ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసి ప్రజలను బెంబేలెత్తించింది.
ఆరు గంటల సమయానికి నగరంలోని మియాపూర్‌లో 3.65 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కేవలం 30 నిమిషాల్లో ఈ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదే సమయానికి సెంటీమీటరు వర్షపాతం నమోదైన చార్మినార్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో.. రాత్రి 7 గంటలకు వరుసగా 4.78, 4.4 సెం.మీ. కురిసింది. నగరంలోని నాలాల సామర్థ్యం కన్నా రెట్టింపు వర్షపాతం నమోదైంది. వరద నాలాలకు గంటకు 2 సెం.మీ. వర్షాన్ని తట్టుకునే శక్తి మాత్రమే ఉంది. అంతకుమించి కురవడంతో నగరంలోని రహదారులు చెరువుల్లా మారాయని అధికారులు తెలిపారు. మరో మూడ్రోజులు వానలు కురిసే అవకాశమున్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.