మంత్రి హరీష్ రావు పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేశారు మైనంపల్లి. హరీష్ రావు అంతు చూసే వరకు వదలబోనని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో హరీష్ రావును అడ్రస్ లేకుండా చేస్తానని అన్నారు.
అవసరమైతే సిద్దిపేటలో తన తడాఖా ఏంటో చూపిస్తానని అన్నారు. హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేశారు. మైనంపల్లి వ్యాఖ్యలతో మంత్రి కేటీఆర్ సహా నేతలంతా ఆయన పై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే కెసిఆర్ ప్రకటించిన జాబితాలో మైనంపల్లికి బెర్త్ దక్కినా.. ఆయన కుమారుడికి సీటు ఇవ్వలేదు.
దీంతో ఆయన పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు మైనంపల్లి. హరీష్ రావు పై చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని అన్నారు. తాను పార్టీని విమర్శించలేదని.. క్యాడర్ తో మాట్లాడి తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. క్యాడర్ కోసం ఏ నిర్ణయమైనా తీసుకుంటానని స్పష్టం చేశారు.