ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు పందుల సత్యం అన్నారు. శుక్రవారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముట్టడి సందర్భంగా పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. దీన్ని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.