హైదరాబాద్ లో త్వరలోనే అతిపెద్ద టన్నెల్‌ అక్వేరియం

-

హైదరాబాద్‌ మహానగరం సిగలోకి మరో కలికితురాయి చేరనుంది. నగర శివారులో దేశంలోనే అతిపెద్ద టన్నెల్‌ అక్వేరియం రానుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.350 కోట్లతో దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది.

బిడ్‌ను దక్కించుకున్న సంస్థకే డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌(డీబీఎఫ్‌ఓటీ) పద్ధతిలో 30 ఏళ్లపాటు ఈ ప్రాజెక్టును అప్పగించనున్నారు. ఇప్పటికే హిమాయత్‌సాగర్‌ సమీపంలో కొత్వాల్‌గూడ వద్ద 150 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏకో పార్కును అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనే అయిదు ఎకరాల్లో భారీ టన్నెల్‌ అక్వేరియాన్ని నిర్మించనున్నారు.

అక్వేరియంలో 180 డిగ్రీల కోణంలో 100 మీటర్ల పొడవు, 3.5 అడుగుల వెడల్పులో వివిధ రకాల టన్నెళ్లు నిర్మిస్తారు. వీటి లోపలికి వెళ్లే పర్యాటకులకు సముద్రం అంతర్భాగంలోకి వెళ్లిన అనుభూతి కలిగేలా తీర్చిదిద్దుతారు.

సముద్రం, నదుల నుంచి తెచ్చే నీటిని నింపేందుకు మూడు వేల మిలియన్‌ లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. వీటిలో వేయి రకాల సముద్ర జీవులను పెంచుతారు. షార్క్‌లు, డాల్ఫిన్లు వంటి వాటికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అక్వేరియం లోపల రెస్టారెంట్‌, డోమ్‌ థియేటర్‌, 7డీ, వీఆర్‌ థియేటర్లు ఇతర ఆధునిక హంగులను కల్పిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news