తెలంగాణ ఎన్నికల సమయంలో కేంద్ర సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఒడిశా గవర్నర్‌గా రఘబర్దాస్ను నియమించింది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఇంద్రసేనా రెడ్డి 1953 జనవరి 1న జన్మించారు. 1983, 1985, 1999లలో జరిగిన ఎన్నికల్లో మలక్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. 1989, 1994లలో అదే నియోజకవర్గంలో ఓడిపోయారు. 1999లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ సభాపక్ష నేతగా పని చేసిన ఇంద్రసేనా రెడ్డి.. 2003-07 మధ్యకాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు.
2014లో పార్టీ జాతీయ కార్యదర్శిగా, 2020లో పార్టీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా సేవలందించారు ఇంద్రసేనా రెడ్డి. 2004లో నల్గొండ, 2014లో భువనగిరి లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వి.రామారావు, సీహెచ్ విద్యాసాగర్‌రావు, బండారు దత్తాత్రేయల తర్వాత ఇంద్రసేనారెడ్డి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.