ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేళ్లు సీరియల్స్ లాగా సాగదీసిన ఈ కేసును ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిందని.. ఈ కేసులో కవిత బాధితురాలే కానీ నిందితురాలు కాదన్నారు.
2004 నుండి 2014 వరకు 200 ఈడీ కేసులో ఉంటే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుండి 2024 వరకు.. కేవలం పది సంవత్సరాలు 2954 పై చిలుకు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎన్నికల టైంలో ప్రత్యర్థులను వేధించడానికి బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు నుండి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాబాశం వ్యక్తం చేశారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.