దర్శకుడు ఎన్.శంకర్ కు మోకిళ్లలో 5 ఎకరాల కేటాయింపు పై కరీంనగర్ కి చెందిన జె.శంకర్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ ని నేడు హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కోట్ల విలువైన భూమిని ఎకరానికి 5 లక్షలకే కేటాయించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శంకర్ తరపున న్యాయవాది వాదిస్తూ.. ఇక్కడ స్టూడియోలు పెట్టడం వలన బాలీవుడ్ కళాకారులు వస్తూ ఉంటారని.. అందువల్ల చాలామందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని వాదించారు.
ఎఫ్డిసి సిఫార్సు మేరకు రాయితీ ధరతో కేటాయించే అధికారం కేబినెట్ కి ఉందన్నారు ఏజీ. అన్ని అంశాలు పరిశీలించాకే శంకర్ కి భూమి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల ఏడున తుది తీర్పును వెల్లడిస్తామని తెలిపింది న్యాయస్థానం.