కేసీఆర్ పాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తెలంగాణ మోడల్ అంటే తరచూ ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడమా..? యువత ఆత్మహత్యలు చేసుకోవడమా..? సాగునీటి పేరుతో డబ్బు దండుకోవడమా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మద్యం విధానంపై ఆధారపడటమే తెలంగాణ మోడలా అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీనెల 1న జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఆయన విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. ఆ ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోయిందని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ పరిస్థితి జరిగిందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన కోసమే తెలంగాణ వచ్చినట్టుంది.. కేసీఆర్ పేద ప్రజల కోసం చేసింది తక్కువ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అభివృద్ధికి సంబంధించిన వాటిని కప్పి పుచ్చుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కాలం చెల్లిందని.. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.