అమరవీరుల స్థూపం దగ్గర కెసిఆర్ ని ఎకె-47 తో కాల్చినా తప్పులేదన్నారు రేవంత్ రెడ్డి. రైతులను ఆదుకోవడం వదిలేసి చస్తే ఐదు లక్షలు ఇస్తారా అని ప్రశ్నించారు. కెసిఆర్ దుర్మార్గ విధానాలపై రచ్చబండలో చర్చిస్తామన్నారు రేవంత్ రెడ్డి. త్వరలోనే విద్యా, వైద్యం పై కూడా డిక్లరేషన్ ఇస్తామని అన్నారు. ధరణి సమస్యలకు పరిష్కారం.. కేసీఆర్ ని గద్దె దించడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 65 ఏళ్ల పాలనలో తెచ్చిన మెరుగైన వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేశారని మండిపడ్డారు.
తెలంగాణలో చెరుకు, పసుపు, కందులు, జొన్నలు సాగు కనుమరుగయ్యింది అన్నారు. అందరూ వరి సాగు చేయడం పెరిగింది.. కెసిఆర్ ఇదేదో నాదే పెద్ద గొప్ప అని చెప్పుకుంటున్నాడని అన్నారు.కాలేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తానన్న కెసిఆర్ 30 లక్షల పంపుసెట్లు ఎందుకు వాడుకలో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని ఆ బాధ్యత నాది అన్నారు రేవంత్ రెడ్డి.