హైదరాబాద్ నగరంలోలో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న వానతో చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా వరద పోటెత్తడంతో జలమండలి అధికారులు రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్‌లతో ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.
క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని .. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. మరోవైపు మ్యాన్ హోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరో రెండ్రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో.. ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.