జానకీపురం సర్పంచ్ నవ్య మరోసారి వార్తల్లోకి వచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై లైంగిక ఆరోపణలు చేసి, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉభయ రాష్ట్రాల్లోనూ సంచలనం రేపారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆమె ప్రయత్నిస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచే ఆమె టిక్కెట్ ఆశించడం విశేషం. అయితే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాజీమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టిక్కెట్ ప్రకటించారు.
ఇద్దరూ బలమైన నాయకులే అయినా, ఇటీవల జరిగిన పరిణామాలు రాజయ్య ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే కడియం శ్రీహరికి సీఎం కేసీఆర్ ఛాన్స్ ఇచ్చారు. టిక్కెట్ పై ప్రకటన కూడా చేశారు. అయితే అనూహ్యంగా జానకీపురం సర్పంచ్ నవ్య తెరపైకి రావడం స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాల్లో కలకలం రేగినట్లయింది. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం నుచి ఒక్కసారి కూడా మహిళకు అవకాశం రాలేదని, ఈసారైనా అవకాశం కల్పించాలని ఆమె కోరుతున్నారు. ఈ క్రమంలోనే తనకు టిక్కెట్ ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ ను అభ్యర్ధించనున్నట్లు సమాచారం. ప్రగతిభవన్ కు వెళ్ళి కేసీఆర్ ను కలిసి టికెట్ కోసం విజ్ఞప్తి చేస్తారని తెలుస్తోంది. మాదిగ బిడ్డనైన తనకు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తారనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. ఎమ్యెల్యే రాజయ్యపై అనేక ఆరోపణలు చేసిన నవ్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమై.. ఇప్పుడు టికెట్ రేసులోకి వచ్చి కడియం శ్రీహరి, రాజయ్యతో పోటీ పడటం హాట్ టాపిక్ అయింది. అయితే ఆమె రిక్వెస్ కి సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో, టిక్కెట్ ఇస్తారో లేదో.. అనేది ఆసక్తికరంగా మారింది.