వన్ నేషన్..వన్ ఎలక్షన్..సాధ్యమేనా?

-

వన్ నేషన్..వన్ ఎలక్షన్..ఈ నినాదం..కేంద్రంలో బి‌జే‌పి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వినబడుతూనే ఉంది. అంటే కేంద్రంలో లోక్‌సభ ఎన్నికలు, ఇటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం. అలా చేస్తే ఎన్నికల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గడంతో పాటు సమయం కలిసొస్తుందని, అలాగే ఎన్నికల కోడ్ అంటూ..ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలకు అడ్డు ఉండదు. ఇంకా ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల లాభాలు ఉన్నాయి.

అందుకే ఆ దిశగా మోదీ సర్కార్ ఆలోచన చేస్తూనే ఉంది..కానీ దీన్ని ఆచరణలోకి తీసుకురాలేదు. ఎప్పటికప్పుడు దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా కేంద్రం..పార్లమెంట్ సమావేశాలు సడన్ గా నిర్వహించడం సంచలనంగా మారింది. వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత కూడా ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.

ఇందులో ముఖ్యంగా ఒక దేశం..ఒకేసారి ఎన్నికలు అనేది కీలకంగా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించి.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు కల అవకాశాలను పరిశీలించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఇతర సభ్యుల పేర్లతో ఓ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కాబోతోందని తెలిసింది.

అయితే ఈ బిల్లు ఆమోదం అనేది సులువు కాదు..దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణలు చేయాలి..543 స్థానాల్లో 67 శాతం అనుకూలంగా ఓటేయాలి. రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం అనుకూలంగా ఉండాలి. సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోద ముద్రవేయాలి. అంటే 14 రాష్ట్రాలు మద్ధతు ఇవ్వాలి. ఇక లోక్ సభ లో ఎన్డీయేకు 333 ఓట్ల బలం ఉంది అంటే 61 శాతం…దీనికి ఇంకో 5 శాతం మద్ధతు కావాలి. రాజ్యసభలో మాత్రం 38 శాతం మద్ధతు ఉంది..అంటే రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్ సభలో ఆమోదం పొందిన రాజ్యసభలో మాత్రం కష్టమే. చూడాలి మరి ఒకే దేశం..ఒకేసారి ఎన్నికలు వర్కౌట్ అవుతాయో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news