తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ప్రజలను ఉర్రూతలూగించిన పాట ‘జయ జయహే తెలంగాణ’ . ఈ గీతం ఆవిష్కరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే జూన్ 2వ తేదీకి తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే దీన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సాంగ్ కంపోజింగ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మంగళవారం రోజున గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి భేటీ అయ్యారు.
తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా.. అస్తిత్వానికి ప్రతీకగా.. ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా.. సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందెశ్రీ రాసిన ఈ గీతం సుమారు 6 నిమిషాల నిడివి ఉంటుంది. అందులో మార్పులేమీ చేయకుండా యథాతథంగా ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, దేశవిదేశీ ప్రముఖులు హాజరైన సందర్భాల్లో వినియోగించడానికి వీలుగా గీతాన్ని 60-90 సెకన్ల నిడివి మించకుండా రూపొందించాలని సీఎం సమక్షంలో నిర్ణయించారు. ప్రధాన గీతంలోని భావోద్వేగాలను అలాగే కొనసాగిస్తూ నిడివి తగ్గించేందుకు అందెశ్రీకి పూర్తి స్వేచ్ఛ, బాధ్యత, అధికారం అప్పగించారు. దీనికి సంగీతం అందించే బాధ్యతలను ఆస్కార్ పురస్కార గ్రహీత కీరవాణికి అప్పగిస్తే బాగుంటుందన్న అందెశ్రీ సూచనల మేరకు ఆయనను ఇందులో భాగస్వామిని చేశారు.