జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నాలుగేళ్లు శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న జేపీఎస్ ల ఉద్యోగాలను నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి, క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జేపీఎస్‌ల క్రమబద్దీకరణపై సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని కొనియాడారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో జేపీఎస్ ల కృషి ఉందని చెప్పారు.
నిర్ధేశించిన లక్ష్యాలను మూడింట రెండొంతులు చేరుకున్న కార్యదర్శులను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం సంబంధించిన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న కార్యదర్శుల పని తీరును జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందని కేసీఆర్ అన్నారు.