గత కొంతకాలంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచి నవ్య మధ్య వివాదం రగులుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదంపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పందించారు. తాటికొండ రాజయ్యపై నవ్య చేస్తున్న ఆరోపణలు నిజమని తేలితే ఎమ్మెల్యేపై పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో మంగళవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు.
‘‘ఎమ్మెల్యే తప్పు చేశారా.. లేదా? అనే విషయాన్ని పోలీసులు తేెలుస్తారు. మహిళలను మా పార్టీ గౌరవిస్తుంది. తప్పు చేసినట్లు తేలితే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే. మహిళా సర్పంచి చేసిన ఆరోపణలు నిజమా.. కాదా? అని తెలుసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోరు’’ అని కడియం తెలిపారు.
మ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ సర్పంచ్ నవ్య గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వివాదం చెలరేగడంతో రూ.25లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తామని ప్రకటించి ఎమ్మెల్యే రాజయ్య.. నవ్యతో వివాదం పరిష్కరించుకున్నారు. అయితే తాజాగా ఈ నిధుల కేటాయింపుపై ఒప్పందం పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఫిర్యాదు చేశారు.