కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ రద్దు విషయంలో క్లారిటీ వచ్చే వరకు తమ ఆందోళన విరమించేదే లేదని బాధిత రైతులు తేల్చిచెప్పారు. మరోవైపు మాస్టర్ ప్లాన్ రద్దు కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం భవిష్యత్ కార్యాచరణపై రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో బాధితగ్రామాల రైతులతో సమావేశం నిర్వహించింది. జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వెల్లడించిన విషయాలపై చర్చించారు. అధికారికంగా ప్రకటన వచ్చేవరకు ఎవరిని నమ్మేదిలేదని ముందుకే వెళ్లాలని తీర్మానించారు.
ఎట్టి పరిస్థితుల్లో భూములను కోల్పోయే ప్రసక్తే లేదని బాధిత రైతులు అన్నారు. నేడు మున్సిపల్ కౌన్సిలర్లందరికి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. 11 న పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాలని తీర్మానించారు. అప్పటికి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే మళ్లీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపల్ నూతన మాస్టర్‌ప్లాన్‌లో పారిశ్రామిక, గ్రీన్జోన్ల కింద పంటలు పండే పొలాలను ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే.