ఈనెల 22వ తేదీ నుంచి మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఆయన మిర్యాలగూడ నుంచే ఈ యాత్ర ప్రారంభించనున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ తో సమావేశమైన కేటీఆర్, హరీష్ రావు సహా ముఖ్యనేతలు బస్సుయాత్ర నిర్వహణ, రూట్ మ్యాప్ పై సమీక్షించారు. సోమవారం నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు కేసీఆర్ బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ మేరకు బస్సు యాత్రకు అనుమతి కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతిపత్రం కూడా అందించారు. సోమవారం రోజున మిర్యాలగూడ నుంచి బీఆర్ఎస్ అధినేత బస్సుయాత్ర ప్రారంభం కానుంది. సాగర్ ఆయకట్టుకు నీరు ఇవ్వకపోవడంతో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించి రైతులతో మాట్లాడతారు. ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో మూడు, నాలుగు ప్రాంతాల్లో బస్సుయాత్ర జరగనుంది. వచ్చే నెల పదో తేదీన సిద్దిపేటలో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ముగింపు సందర్భంగా అక్కడ బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు.