తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పార్టీ నుంచి కీలక నేతలు వెళ్లిపోయినా.. గెలుపు గుర్రాలను పార్లమెంట్ ఎన్నికల బరిలో నిల్చోబెట్టిన పార్టీ అధినేత కేసీఆర్ ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. స్థానిక నేతలతో చర్చించి మరీ అభ్యర్థులను ఖరారు చేశారు.
దశల వారీగా ఎన్నికల కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ మరోసారి లోక్‌సభ నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతల సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో చేవెళ్ల, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల సమావేశాలు కూడా తెలంగాణ భవన్‌లోనే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. మరోవైపు ఏప్రిల్ 13వ తేదీన చేవెళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు.