లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించడానికి ఈడీ అధికారులు సమయం కోరారు. ఇవాళ దిల్లీ హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ చేపట్టగా అధికారులు మూడు వారాల సమయం కోరారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ ‘తమకు మంగళవారమే కేజ్రీవాల్ పిటిషన్ కాపీ అందిందని, దాన్ని పరిశీలించి బదులిచ్చేందుకు మూడువారాల సమయం కావాలని కోర్టును కోరారు.
దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ స్పందిస్తూ విచారణలో జాప్యం చేసే వ్యూహంతోనే పిటిషన్‌పై బదులిచ్చేందుకు ఈడీ మరింత సమయం అడుగుతోందని ఆరోపించారు.’ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి సరైన ప్రాతిపదిక ఏదీ లేదని దీనిపై హైకోర్టు చొరవచూపి తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ కాసేపటి తర్వాత మళ్లీ విచారణ చేపడతామని తెలిపారు.