అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే ఆయన సభలో అడుగుపెట్టారు.
ఆ తర్వాత రెండుసార్లు సభ జరిగినా గులాబీ దళపతి జాడలేదు. ఇప్పుడు తమ నేతలు వరుసగా చేజారిపోతున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకు సభలో అడుగుపెడతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
కాగా, ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ లు, సీఎస్, డీజీపీ, అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం రైతు భరోసా విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తోంది. ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.