సికింద్రాబాద్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి : కిషన్ రెడ్డి

సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎనిమిది మంది చనిపోవడం దురదృష్టకమని మంత్రి పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌లో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని అధికారులతో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు. కేంద్రప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయాలైన వారికి 50 వేల పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న మోదీ ప్రమాదంపై ఆరా తీశారని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారని కిషన్ రెడ్డి చెప్పారు.

మరోవైపు దట్టమైన పొగ వల్లే ఎనిమిది మృతి చెందారని అగ్నిమాపక అదనపు డీజీ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి కాస్త విషమంగా ఉందని.. మరికొందరు కోలుకుంటున్నారని తెలిపారు.