హైదరాబాద్ జలసౌధలో సోమవారం జరగాల్సిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం మరోమారు వాయిదా పడింది. శాసనసభ సమావేశాలు ఉన్నందున భేటీకి హాజరు కావడం వీలు కాదని బోర్డుకు ముందే ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమాచారం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురేను కలిసిన తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.. తమ వాదనలు వినిపించారు. ఉమ్మడి జలాశయాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఎక్కువ నీటిని వినియోగించుకున్నందున తదుపరి అనుమతి ఇవ్వవద్దని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఛీఫ్ మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరారు.
ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ ఇప్పటికే ఎక్కువ నీటిని ఉపయోగించుకొందని… ఇంకా వినియోగించుకుంటే తెలంగాణకు నష్టం జరుగుతుందని కమిటీకి తెలిపారు. తమకు ఇంకా నీటిలో వాటా ఉందని ఏపీ చెబుతున్న లెక్కలు సబబు కాదని అన్నారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని నీటి విడుదల ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ఈఎన్సీ బోర్డును కోరారు. ఆలస్యం చేస్తే పంటకాలం కూడా పూర్తవుతుందని తెలంగాణకు నష్టం జరుగుతుందని అన్నారు.