కేటీఆర్ యాక్ష‌న్‌.. మృతుడి కుటుంబానికి రూ.4ల‌క్ష‌లు చెల్లించిన ప్రైవేటు ఆస్ప‌త్రి

కరోనా సెకండ్ వేవ్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప్రైవేటు ఆస్ప‌త్రులు ఏ స్థాయిలో దోచుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. ల‌క్ష‌ల్లో బిల్లులు వేస్తూ నిలువునా దోపిడీ చేస్తున్నాయి. ప్రైవేటు ఆస్ప‌త్రికి వెళ్లాలంటేనే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఈ విష‌యాల‌పై మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ ద్వారా ఎన్నో ఫిర్యాదులు వ‌స్తూనే ఉన్నాయి. ఇక ఇలాంటి ఘ‌ట‌న‌పై కేటీఆర్ చాలా సీరియ‌స్‌గా స్పందించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తూప్రాంపేటకు చెందిన చిలుకూరి రవీందర్‌రెడ్డి రీసెంట్‌గా కరోనా సోకింది. దీంతో ఆయనను మే 15న ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రితో చేర్పించారు కుటుంబ స‌భ్యులు. రెండు వారాల పాటు ఆయ‌న అదే ఆస్ప‌త్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నా కోలుకోలేదు.

ఈ ట్రీట్ మెంట్‌కు మొత్తం రూ.7 లక్షలు బిల్లు వసూలు చేశారు ఆస్ప‌త్రి యాజ‌మాన్యం. ఇక ర‌వీంద‌ర్ రెడ్డిని మే 30న గాంధీ ఆసుపత్రికి తరలించ‌గా.. తెల్లారే మృతి చెందారు. దీంతో ఎల్బీన‌గ‌ర్ ప్రయివేట్ ఆస్పత్రి దోపిడీ మంత్రి కేటీఆర్‌కు చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి కంప్ల‌యింట్ చేశారు. ఎలాగైనా బాధిత కుటుంబానికి న్యాయం చేయాల‌ని కోరారు. దీంతో కేటీఆర్ వెంటనే స్పందించారు. ఈ ఫిర్యాదును ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజుకు అప్పగించారు. ఆయ‌న చొర‌వ‌తో ఆస్ప‌త్రి యాజమాన్యం రూ.4 లక్షలను మృతుడి సోదరుడు రంగారెడ్డికి అప్ప‌జెప్పారు. దీంతో కేటీఆర్‌ను అంతా మెచ్చుకుంటున్నారు.