రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. రెండు పడకల గదుల నిర్మాణాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. భూపాలపల్లికి తొలిసారి వస్తున్న మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. భారీ కటౌట్లు, బ్యానర్లు, పార్టీ జెండాలతో పట్టణం గులాబీ మయమైంది.
ఘన్‌పూర్‌లో నిర్మించిన తహశీల్దార్ కార్యాలయం, మహాత్మా జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభించిన అనంతరం కేటీఆర్.. సింగరేణి కార్మికుల కోసం నిర్మించిన వెయ్యి ఇళ్లను ప్రారంభిస్తారు. వేశాలపల్లి గ్రామంలో నిర్మించిన 500 రెండు పడక గదుల ఇళ్లను మంత్రికి శ్రీకారం చుడతారు. నూతన గ్రంథాలయ భవనం, మినీ స్టేడియం, స్ట్రీట్ వెండర్ జోన్ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2గంటల45నిమిషాలకు… అంబేడ్కర్ మైదానంలో జరిగే బహిరంగసభలో కేటీఆర్ పాల్గొంటారు.