తెలంగాణలో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన మంగళవారం రోజున పర్యటించారు. రాష్ట్రంలో ఆంజనేయ స్వామి గుడిలేని ఊరు లేదని.. అలాగే కేసీఆర్ పథకం లేని ఇల్లు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
సిరిసిల్లలో పలు గ్రామపంచాయతీ భవనాలను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం సిరిసిల్లలో 400మంది లబ్ధిదారులకు రెండుపడక గదుల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటిని అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకం అందని ఇల్లే లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2,052 మందికి రెండుపడక గదుల ఇళ్లు ఇచ్చామన్న కేటీఆర్.. ఇంకా 730 మందికి మాత్రమే ఇళ్లు ఇవ్వాల్సి ఉందన్నారు. అర్హులందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామని తెలిపారు.
అంతకుముందు ఎల్లారెడ్డిపేటలో విద్యార్థులకు “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా ట్యాబ్‌లను అందజేశారు. ప్రపంచంతో పోటీపడే పౌరుల్లాగా… విద్యార్థులు తయారు కావాలని ఆకాంక్షించారు.