పని చేసే నాయకుడిని ప్రోత్సహించడం మన కర్తవ్యం: కేటీఆర్‌

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ జోరు చూపిస్తున్నారు. రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. ప్రజల్లోకి బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని తీసుకువెళ్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొయినాబాద్​లో రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు.

చేవెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం 111జీవోను ఎత్తేశామని కేటీఆర్ అన్నారు. 111 జీవోలో న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పనిచేసే నాయకున్ని ప్రోత్సహించడం ప్రజల బాధ్యత అని.. కేసీఆర్‌కు అత్యంత సన్నిత ఎమ్మెల్యేల్లో కాలె యాదయ్య ఒకరని చెప్పారు. అందుకే ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ప్రభుత్వం.. కేసీఆర్​ది అని కేటీఆర్ చెప్పారు. 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ.75 వేల కోట్లు జమ చేసిన సీఎం.. కేసీఆర్‌ అని పునరుద్ఘాటించారు.

“కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థుల గురించి మీకు బాగా తెలుసు. రెండుసార్లు ఆశీర్వదిస్తే కేసీఆర్ ఏం చేశారో ప్రజల కళ్ల ముందే ఉంది. రైతుబీమా పెట్టి ధీమాగా ఉండేలా కేసీఆర్ చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నారు. సౌభాగ్యలక్ష్మిలో ప్రతి ఆడబిడ్డకు రూ.3 వేలు ఇస్తాం.” అని కేటీఆర్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news