ఫార్ములా ఈ రేస్ కేసు పై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అరవింద్ కి డబ్బులు బదిలీ చేయమని తానే చెప్పానన్నారు. కానీ కోర్టులో మాత్రం తనకేం సంబంధం లేదని చెబుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ఇదేం నీతి అని ప్రశ్నించారు. నోటీసులు ఇస్తేనే కేటీఆర్ లొల్లి చేస్తున్నాడు. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ ఎపిసోడ్ ను కూడా ఇలానే చేశారని విమర్శలు గుప్పించారు.
తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి కొంత సమయం ఇచ్చే వాళ్ళమని.. కానీ కేటీఆర్, హరీష్ లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కనిపించడం లేదు.. ప్రతిపక్ష నాయకుడు ఎవరు అనేది తెలియడం లేదని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.