కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి కేటీఆర్‌ సలహాలు సూచనలతో కూడిన లేఖ

తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ కి తెలంగాణలో జరుగుతున్న వ్యాక్సిన్‌ అభివృద్ధి గురించి వివరిస్తూ లేఖ రాశారు. ఈ సందర్భంగా సలహాలు, సూచనలు చేశారు. తెలంగాణ కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో బాగంగా 5 బిలియన్ డోసులు ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ని ఉత్పత్తి చేస్తున్నామని, ఇది ప్రపంచ ఉత్పత్తిలో మూడో వంతుగా ఉందని వివరించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో హైదరాబాద్‌కు చెందిన మూడు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయని, త్వరలోనే ఇక్కడి నుండి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తామన్నధీమా వ్యక్తం చేశారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందుల తయారీ లో కూడా తాము ముందంజలోనే ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.

బయోటెక్‌ పరిశ్రమ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశామని, వాటిలోంచి ముఖ్యంగా తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకున్నామని తెలిపారు. క్లినికల్‌ ట్రయల్స్‌, వ్యాక్సిన్ల తయారీ, అనుమతులు మరియు టెస్టింగ్‌ ట్రాకింగ్‌ వ్యవస్థల్లో మరింత వికేంద్రీకరణ అవసరం ఉందని గుర్తు చేశారు. దీంతోపాటు వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రత్యేక ఫండింగ్ అవసరముందని కేటీఆర్‌ తన లేఖలో ప్రస్తావించారు.

సెంట్రల్‌ డ్రగ్‌ లాబొరేటరీ సమీపంలో లేకపోవడం వల్ల లాక్‌డౌన్‌ సమయంలో శాంపిళ్లను పంపడంలో తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలిపారు. బ్రిటీష్‌ పాలనలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ డ్రగ్‌ లాబొరేటరీ ఇంకా హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉందని, మరింత వేగంగా వ్యాక్సింగ్ తయారు చేసే ఉద్దేశంతో కంపెనీలు పని చేస్తున్న నేపథ్యంలో వారికి కొంత సులభంగా అనుమతులు ఇచ్చే ఈ విషయాన్ని పరిశీలించాలన్నారు. అయితే ప్రస్తుతం తాత్కాలికంగా ఇచ్చిన వెసులుబాటును శాశ్వతంగా ఉండేలా చూడాలని కోరారు.

పోటీని తట్టుకొని ప్రపంచ బయోటెక్ రంగంలో దేశాన్ని మరింత అగ్ర స్థానం నిలపాలంటే అనుమతులు, క్లియరెన్స్ ల విషయంలో మరింత సులభంగా ఉండేలా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ దిశగా వికేంద్రీకరణ కోసం కేంద్రం చర్యలు తీసుకొని CDSCO జోనల్ కార్యాలయాన్ని హైదరాబ్‌ద్‌లో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని, ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న ఈ జోనల్ కార్యాలయానికి మరిన్ని అధికారాలు, నిధులు ఇచ్చి బలోపేతం చేయాలని మంత్రి లేఖలో పేర్కొన్నారు. తద్వారా కంపెనీలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.

వ్యాక్సిన్‌లకు అనుమతి పొందాలంటే దేశంలోని 6 కేంద్ర మంత్రిత్వ శాఖలు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ అనుమతుల ప్రక్రియ ఉంటుందని తెలిపిన మంత్రి కేటీఆర్, ఈ కాంప్లెక్స్ ప్రక్రియను కొంత సులభతరం చేస్తూ కఠినమైన నిబంధనలతోనే సులభంగా, ఆలస్యం కాకుండా వ్యాక్సిన్లు అనుమతి లభించే తీరుగా నూతన విధానాన్ని రూపకల్పన చేయాలని సూచించారు.

ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్ కి సంబంధించి లైసెన్సింగ్ ప్రక్రియ పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్ డి ఎ ఎ వంటి సంస్థలు మార్గదర్శకాలను జారీ చేశారని, దేశీయంగా గైడ్లైన్స్ నీ త్వరగా రూపొందించాలని తద్వారా వాక్సిన్ తయారీలో కంపెనీలకు ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. వ్యాక్సిన్ పెద్దయెత్తున ప్రజలకు అందుబాటులో ఉండాలంటే వ్యాక్సిన్ ట్రయల్స్ కి సంబంధించి నూతన ఫ్రేమ్వర్క్ ని ఏర్పాటు చేయాలని సూచించారు. కంపెనీలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి పెట్టుకొని విజయవంతంగా ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేసే విధంగా అవకాశం ఇవ్వాలన్నారు.

వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో ఉండాలంటే ముందుగా వాక్సిన్ ప్రోకూర్మెంట్ పాలసీని ప్రభుత్వం సిద్ధంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో ప్రభుత్వం వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడంలో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న కంపెనీలకు కేటాంయిన సుమారు 100 కోట్ల నిదులు వారికి అందించేందుకు మార్గదర్శకాలు తయారు చెయ్యాలని, వ్యాక్సిన్ తయారీలో ముందువరుసలో ఉన్న కంపెనీలకు ఫండింగ్ ఇచ్చేలా నూతన నిధిని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. తద్వారా వేగంగా వాక్సిన్ తయారు చేసే అవకాశం ఉంటుందని, ఈ విషయం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు.

ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం మరింత బలోపేతం కావాలని కోరుకునే రాష్ట్రల్లో తెలంగాణ ఒకటని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా సహకారం పరిశ్రమకు లేదా కేంద్ర ప్రభుత్వానికి అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కి హామీ ఇచ్చారు. ప్రపంచ వ్యాక్సిన్‌ తయారీ రంగంలో మన దేశం అగ్రస్థానంలో ఉందని సరైన నిర్ణయాలే మనల్ని లీడర్లుగా నిలబెట్టగలమని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.