బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ఈ పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం కూడా షురూ చేశారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీబిజీగా గడుపుతున్నారు.
నిర్మల్ జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఅర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 7 వందల14 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం ప్రారంభించిన తర్వాత సోన్ మండలం పాత పోచంపాడులో 40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ఫామ్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. నిర్మల్ పట్టణంలో 10కోట్ల15లక్షలతో ఏర్పాటుచేయనున్న సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
2 కోట్లతో దోబీఘాట్ నిర్మాణానికి, 62.50 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగు పరిచేందుకు అమృత పథకం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. కేటీఅర్ పర్యటన ఎర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.