ఫార్మా రంగానికి హైదరాబాద్ క్యాపిటల్‌గా మారిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నగరం నుంచే ప్రపంచానికి వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నామని చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఇన్నోవేక్స్ సెంటర్‌లో ‘తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్ చైన్’ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ కేంద్రానికి పరిశోధన పరంగా సహాయం చేయనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో దేనిని ఆపగలిగినా.. వ్యవసాయ రంగాన్ని మాత్రం ఆపలేమని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారని కేటీఆర్ తెలిపారు.
ఈ తొమ్మిదేళ్లలో వ్యవసాయరంగ ఉత్పత్తి, ఎగుమతులు ఎంతో పెరిగాయని కేటీఆర్ వెల్లడించారు. సస్టైనబుల్ కూలింగ్‌ను ప్రోత్సహించడమే ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ల్యాబ్, కమ్యూనిటీ కూలింగ్ హౌస్ వంటివి ఈ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇటువంటి కూలింగ్ సొల్యూషన్స్ మనకు దేశంలో ఇంకా కావాలని అన్నారు. రైతులు పండించే ఆహార పదార్థాలు భద్రపరిచేందుకు కూడా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.