ఈ పరాజయం కారుకు చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూ కేసీఆర్ రాజీనామా చేశారని చెప్పారు. కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారని తెలిపారు. ఎంతో కష్టపడినా తాము ఆశించిన ఫలితం రాలేదని.. పరాజయానికి కారణాలు విశ్లేషించుకుంటామని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తమను ఆదేశించారని.. ప్రతిపక్షంగా సమర్థంగా వ్యవహరిస్తామని వివరించారు. తెలంగాణ ఫలితాలు వెల్లడైన సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
“ఎదురుదెబ్బలను గుణపాఠంగా భావిస్తాం.. పాఠాలు నేర్చుకుంటాం. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం. మా ప్రభుత్వానికి సహకరించిన ఉద్యోగులు, అధికారులకు కృతజ్ఞతలు. బాధను దిగమింగి గోడకు కొట్టిన బంతిలా తిరిగివస్తాం. మరింత ఎక్కువగా కష్టపడి మళ్లీ ప్రజల విశ్వాసం చూరగొంటాం. ప్రజల ఆదరణ చూరగొన్న కాంగ్రెస్‌కు అభినందనలు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తాం. పార్టీ శ్రేణులు బాధపడాల్సిన అవసరం లేదు.” అని కేటీఆర్ తెలిపారు.