గుజరాత్​కు ‘సీఎంగా మోదీ సక్సెస్.. కానీ దేశానికి పీఎంగా ఫెయిల్’ : కేటీఆర్

-

నరేంద్ర మోదీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారు కానీ.. దేశ ప్రధాన మంత్రిగా మాత్రం ఫెయిల్ అయ్యారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మోదీ గుజరాత్‌లో ఏదో చేశారని ప్రచారం చేసుకొని 2014లో ప్రధాని అయినప్పుడు.. దేశంలో కూడా మార్పు తెస్తారని ఆశించామని తెలిపారు. అందుకే కొన్ని నిర్ణయాలకు మద్దతు ఇచ్చామని చెప్పారు. అయినా మోదీ తెలంగాణకు మొండి చేయి చూపారని మండిపడ్డారు.

కేంద్రంపై ఆశలు వదిలేసుకొని, సొంతంగా నిలబడి గెలిచామని మంత్రి కేటీఆర్ కుండబద్ధలు కొట్టారు. దేశంలో గత ఏడాది కొత్తగా వచ్చిన ఐటీ ఉద్యోగాల్లో 33 శాతం హైదరాబాద్‌లోనే వచ్చాయని చెప్పారు. ఈ ఏడాది 44 శాతానికి పెరిగిందని వివరించారు. దేశానికి తెలంగాణ రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నా మోదీ ప్రశంసించలేదని ఫైర్ అయ్యారు. సంపద సృష్టే అసలైన రాజకీయం (గుడ్‌ ఎకనామిక్స్‌ ఈజ్‌ గుడ్‌ పాలిటిక్స్‌) అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బలంగా నమ్ముతారని, ఇప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఎదగటానికి అదే కారణమని కేటీఆర్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news