మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అని చెప్పి.. పెద్ద మార్పే తెచ్చారు : కేటీఆర్

-

మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ రాష్ట్రంలో పెద్ద మార్పే తెచ్చారంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం..నీళ్ల చారు ఉండేదని.. నేటి రేవంత్ పాలనలో బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు ఉంటున్నాయని విమర్శించారు. మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి విషాదాంత కథ మరవకముందే.. నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లిపడి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని మండిపడ్డారు.

సుల్తాన్ పూర్ జేఎన్టీయూ హాస్టల్లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరని ప్రభుత్వాన్ని నిలదీశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడని నిలదీశారు. కలుషిత ఆహారం వల్ల…పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే.. విద్యార్థులకు ఈ అవస్థ, ఈ అస్వస్థత అని వ్యాఖ్యానించారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news