విక‌లాంగులకు అండ‌గా కేటీఆర్

తెలంగాణ పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ (KTR) తన పుట్టిన రోజు సంద‌ర్భంగా మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జులై 24న తన జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా విక‌లాంగుల‌కు వాహ‌నాల‌ను అందించ‌నున్న‌ట్లు తెలిపారు. మొత్తం వంద మంది విక‌లాంగులకు ద్విచ‌క్ర వాహ‌నాల‌ను అందించ‌నున్న‌ట్లు ట్వీట్ చేశారు. కాగా కేటీఆర్ గతేడాది కూడా గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా త‌న సొంత డబ్బులతో 6 అంబులెన్స్‌ల‌ను అందించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు క‌లిసి 90 అంబులెన్స్‌ల‌ను అంద‌జేశారు.

కాగా కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ముక్కోటి వృక్షార్చ‌న‌ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. కాగా త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ముక్కోటి వృక్షార్చ‌న‌లో పాల్గొనాలి అని కేటీఆర్ కూడా పిలుపునిచ్చారు. లేదా గిప్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా సొంతంగా ఎవ‌రికైనా స‌హాయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పుష్ప‌గుచ్ఛాలు, కేకులు, హోర్డింగ్‌ల‌పై ఖ‌ర్చు పెట్టొద్ద‌ని కేటీఆర్ కోరారు.