తెలంగాణ జాతి గర్వపడే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన సర్వాయి పాపన్న జయంతి జరుపుకుంటున్నామని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తాడిచెట్టుపై పన్ను విధించిన నియంత పాలనపై పాపన్న వీరోచితంగా పోరాడారని తెలిపారు. నేటి యువతకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. టాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో లక్ష్మణ్ పాల్గొన్నారు. పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విజయశాంతి, కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, భాజపా శ్రేణులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న జీవిత చరిత్ర పుస్తకాన్ని లక్ష్మణ్ విజయశాంతితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం.. పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా, కేంద్ర ఎన్నికల కమిటీ మెంబర్‌గా ఎన్నికైన లక్ష్మణ్‌ను భాజపా శ్రేణులు సన్మానించాయి.