రోజువారీ జీవితంలో ట్రాన్స్‌జెండర్‌లో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. కనీసం వారు ప్రాథమిక హక్కులకు కూడా నోచుకోలేదు. అలాంటి ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం హైదరాబాద్ హబ్సిగూడలోని కాకతీయనగర్‌లో తొలిసారిగా లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభమైంది. నిత్యం వారికి ఎదురయ్యే సమస్యలు, కొరవడిన సామాజిక భద్రత, వివక్షపై న్యాయపోరాటానికి అవసరమైన ప్రోత్సాహం లభించేలా స్థానికంగా ఏర్పాట్లు చేశారు.
వసతి, ఉపాధి, వైద్యం, వివక్షలపై పోరాటం చేసేలా ఇక్కడి పారాలీగల్ వాలంటీర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని లీగల్ ఎయిడ్ క్లినిక్ నిర్వాహకులు ‘తాషి’ తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) చొరవతో ఇటీవలే దీన్ని ప్రారంభించగా.. సమస్యల పరిష్కారం కోసం చాలామంది ఇక్కడికి వస్తున్నారని వెల్లడించారు. ఇల్లు అద్దెకు దొరకకపోవడం.. లైంగిక వేధింపులు, పాఠశాలలు, కళాశాలల్లో ర్యాగింగ్, ఆధార్‌కార్డులో లింగ మార్పిడిపై సవాలక్ష చిక్కులు, ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న బాధితులు ఇలా నగరంలో వేలాది మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులున్నారని పారాలీగల్ వాలంటీర్ ‘తాషి’ తెలిపారు. వీరికి సరైన న్యాయ సలహాలు ఇస్తూ సాయం చేస్తామని వెల్లడించారు.