ఇటీవల క్రూరమృగాలు అడవులను వదిలి జనావాసాల్లోకి ఎక్కువగా వస్తున్నాయి. ప్రజలను భయపెడుతూ కొన్నిసార్లు దాడులు చేస్తూ ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చిరుత, పులి, ఎలుగుబంటి దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో తరచూ చిరుతలు సంచరిస్తూ పాడిఆవులపై దాడులకు తెగబడుతున్నాయి.
తాజాగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. పొత్కపల్లి గ్రామంలోని రైల్వే గేటు వద్ద మంగళవారం రాత్రి చిరుత సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ఆ దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు గుర్తించామని వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో రైలు గేటు పడిన తర్వాత ప్రజలెవరూ లేకపోవడంతో రహదారిపై నుంచి వ్యవసాయ క్షేత్రాల్లోకి చిరుత పులి వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో దృశ్యాలు నమోదయ్యాయి. విషయం గమనించిన గ్రామస్తులు పెద్దపల్లి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. చిరుత పులి సంచరించిన ప్రాంతంలో అటవీ సిబ్బంది బుధవారం సాయంత్రం పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు.