ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాలలో రాగల రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అలాగే నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాలలో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటలలో బలహీనపడనిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిస్సా, చతిస్గడ్ మీదుగా కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.