రాష్ట్రంలో ఐటీ రంగాన్ని నలుమూలల విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ సాఫ్ట్‌వేర్ రంగం విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా ఎదిర, దివిటిపల్లి వద్ద 2018 జులై 7న శంకుస్థాపన చేసిన ఐటీ, మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ కారిడార్ పనులు తుది దశకు చేరుకున్నాయి. స్థానిక యువతకు ఉపాధి కల్పన కోసం ఐదెకరాల్లో చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన ఐటీ టవర్ ప్రారంభోత్సవం జరగనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ టవర్‌ను ప్రారంభించనున్నారు.
ఈ టవర్‌లో సంస్థల్ని ఏర్పాటు చేయడానికి అమెరికా, లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థలు ముందుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరికొన్ని సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. 40 కోట్ల రూపాయల ఖర్చుతో నాలుగు అంతస్థుల్లో నిర్మించిన ఐటీ టవర్‌లో 19వేల 370 చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది. పారిశ్రామికవాడ పనులు కూడా పూర్తైతే 100కు పైగా ఐటీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.