తాంత్రిక పూజల పేరుతో 11 హత్యలు.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నరహంతకుడు

-

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఓ నరహంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. తాంత్రిక పూజల పేరుతో దాదాపు పదకొండు మందిని అతి క్రూరంగా హతమార్చాడని పోలీసులు తెలిపారు. అమాయక ప్రజలను గుప్తనిధులు వెలికితీస్తానని నమ్మించి వారి ఆస్తులను తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం.. అనంతరం పూజలు చేస్తానని దూరప్రాంతాలకు తీసుకెళ్లి హతమార్చడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి జిల్లా కేంద్రంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసే అతడు 2018లో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తరువాత తాంత్రిక పూజలు చేస్తానంటూ అమాయక ప్రజలను నమ్మిస్తూ… ఇళ్లలో, పొలాల్లో గుప్తనిధులు వెలికితీస్తానంటూ వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు.

డబ్బులు లేవంటే వారి స్థిరాస్తులను తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకుని నిధి దొరికిన తరువాత తనకు డబ్బులు ఇస్తే మళ్లీ వారి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసిస్తానని నమ్మబలికే వాడు. డబ్బులు తిరిగివ్వాలని, ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేసివ్వాలని ఒత్తిడి చేసిన వారిని.. క్షుద్రపూజల పేరిట దూరప్రాంతాలకు తీసుకెళ్లి హత్య చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. దాదాపు 11 హత్యల్లో ఈ వ్యక్తే నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news