మంచిర్యాల ఘటనలో దర్యాప్తు ముమ్మరం.. 40 లీటర్ల పెట్రోల్‌ కొనుగోలు చేసిన నిందితులు

-

మంచిర్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురు సజీవదహనం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఆధారాల అన్వేషణలో పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. నిందితులు శ్రీరాంపూర్‌లోని పెట్రోల్‌ బంక్‌లో 40 లీటర్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్థారించారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. అటు సింగరేణి ఉద్యోగి శాంతయ్య మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబీకులు నిరాకరించారు. మున్సిపాలిటీ సిబ్బందికి మృతదేహం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఘటనాస్థలిని మరిన్ని ఆధారాల కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

గుడిపెల్లి (వెంకటాపూర్‌) గ్రామంలో మసా పద్మ (45), శివయ్య (50) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. ఓ కుమార్తె నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు నస్పూర్‌లో, రెండో కుమార్తె హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కుమార్తె అంత్యక్రియల కోసం దంపతులు మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి, అప్పట్నుంచి అక్కడి పెంకుటింట్లోనే ఉంటున్నారు. పద్మతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సింగరేణిలో మజ్దూర్‌గా పనిచేస్తున్న శనిగారపు శాంతయ్య అలియాస్‌ సత్తయ్య (57) ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. కొండంపేటకు చెందిన నెమలికొండ మౌనిక (23), తన ఇద్దరు పిల్లలు ప్రశాంతి (2), హిమబిందు (4)తో కలిసి నాలుగు రోజుల క్రితం పెద్దమ్మ పద్మ ఇంటికి వచ్చి అక్కడే ఉన్నారు.

 

శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఇంట్లో మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాకపోవడంతో పోలీసులకు, అగ్నిమాపక శకటానికి సమాచారం అందించారు. వారు వచ్చేసరికే ఇంట్లో ఉన్న ఆరుగురూ సజీవ దహనమయ్యారు. పద్మతో శాంతయ్య వివాహేతర సంబంధం, ఆస్తి వివాదాల నేపథ్యంలో శాంతయ్య భార్య సృజన ఆమె ప్రియుడితో కలిసి ఇంటికి నిప్పు పెట్టినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news