ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వ రేసులో మండవ!

-

ఖమ్మం లోక్‌సభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ సీటు కోసం ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యుల కోసం పట్టుబడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను పార్టీ అధిష్ఠానం తిరస్కరించినట్లు సమాచారం. మాజీ ఎంపీ ఆర్‌.సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డికి ఎక్కువ అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.

అయితే తాజాగా నిజామాబాద్‌కు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఖమ్మం జిల్లాకే చెందిన పారిశ్రామికవేత్త రాజేంద్రప్రసాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేసి గట్టిగా ప్రయత్నించి మంత్రుల పోటీలో వెనక్కుతగ్గారు. తాజాగా ఆయన కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. అయితే మండవ పేరును కొందరు ముఖ్య నాయకులు తెరపైకి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రఘురామిరెడ్డితోపాటు ఆయన పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి తేలిన తర్వాతే కరీంనగర్‌ అభ్యర్థిపై పార్టీ నిర్ణయం తీసుకోనుంది. కరీంనగర్‌ నుంచి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేంద్రరావుల పేర్లు తుది జాబితాలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news